బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా, వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ప్రభుత్వ చర్యలు:
ఇక భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేకచోట్ల రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని కీలక అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లను, సంబంధిత విపత్తు నిర్వహణ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే చెట్లు కింద నిలబడ వద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
సీఎం కీలక ఆదేశాలు:
ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వర్షాలపై అధికారులతో మాట్లాడారు. వర్ష ప్రభావిత కోస్తా జైల్లలైనా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల మరియు రాయలసీమ జిల్లాలు కడప, తిరుపతిలలో పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు.