ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతోంది. కొత్త విధానం ప్రకారం..ఏపీలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను బంద్ చేసి వాటిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్లే ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించబోతున్నారు.
ప్రస్తుతానికి ఏపీలోని బార్లు మాత్రమే ప్రైవేట్ వెండర్ల క్రింద ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటి లైసెన్స్‌లను ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పొడిగిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 50 వేల ఇళ్లకు ఒక బారు ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో డిమాండ్ పెరిగి అక్రమ మద్యం విక్రయాలు పెరిగిపోయాయని గుర్తించిన కూటమి ప్రభుత్వం..దీనిని సడలించి ప్రతి 20-30 వేల ఇళ్లకు ఒక బార్ ఉండేలా మార్చాలని ఆలోచిస్తోంది.
మార్కెట్ నుంచి చీప్ లిక్కర్‌ను పూర్తిగా తొలగించి..కేవలం మంచి బ్రాండ్ల మద్యాన్ని కొత్తగా తీసుకురావాలని ఆలోచిస్తోంది. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, త్రీ క్యాపిటల్ బ్రాండ్‌లు ఇకపై ఏపీవాసులకు మద్యం మార్కెట్‌లో కనిపించవు. వీటికి బదులుగా మంచి బ్రాండ్స్ అయిన రాయల్ స్టాగ్ వంటి ఇతర మెరుగైన బ్రాండ్‌లు అందుబాటులో ఉంటాయి.
గత వైసీపీ ప్రభుత్వం మద్యం వినియోగాన్ని తగ్గిస్తామని చెప్పి.. రూ.60 విలువ చేసే ఆల్కహాల్‌ను సుమారు రూ.200కి విక్రయిస్తూ వచ్చింది.దీంతో వైసీపీ తీరుపై మందుబాబులు పెద్ద ఎత్తున ఫైర్ అయినా సర్కార్ వెనక్కి తగ్గలేదు. అయితే తాజా ఎన్నికలలో మద్యం ధరలను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో.. ప్రభుత్వం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి తోడు మద్యం షాపుల దగ్గర గతంలో ఉండే పర్మిట్ రూమ్‌లను జగన్ ప్రభుత్వం తొలగించిందని, దాని వల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారి సంఖ్య పెరిగింది. ఇలా మద్యం సేవించడం వల్ల జరిగే నేరాలను నియంత్రించడానికి టీడీపీ ప్రభుత్వం మళ్లీ పర్మిట్ రూంలను తీసుకురానుంది. మొత్తంగా అక్టోబర్ 1, 2024 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుండటంతో మందు బాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.