వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ..అడారి ఆనంద్ కుమార్ తాజాగా బీజేపీలో చేరడం వెనుక ఎవరున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. వైసీపీ నేతగా ఉన్న.. అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.అయితే ఆయన ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని గట్టి ఆరోపణలే ఉన్నాయి. దీంతోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు అడారి ఆనంద్ ఆరోపణలు చేస్తూ.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు.
దీనికోసమే విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. విశాఖ డైరీలో జరిగిన అవినీతిపై లోతుగా విచారణ కూడా కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అడారి ఆనంద్ కుమార్ టీడీపీలోకి రావడానికి ప్రయత్నించినా.. ఆ పార్టీ శ్రేణులు ఒప్పుకోలేదు. అయితే అనూహ్యంగా ఆనంద్ బీజేపీలో చేరిపోయారు. అయితే అక్కడ కూడా ఆయన చేరడ చేరిక బీజేపీ నేతలకు సైతం ఇష్టం లేదు. కానీ ఆయన చేరిక వెనుక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్..భారీ మెజారిటీతో గెలిచారు. తాజాగా ఉమ్మడి విశాఖలో మంచి ప్రభావమే చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అక్కడ మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నా సరే.. సీఎం రమేష్ మాటకే ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్ సుదీర్ఘకాలం టీడీపీలోనే కొనసాగారు. 1985 నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఆయన..2012 నుంచి టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చి చివరకు 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. అయినా కూడా టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అడారి ఆనంద్ కుమార్ బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం వెనుక కూడా.. సీఎం రమేష్ ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండటంతో..సీఎంచంద్రబాబు అనుమతి తీసుకోకుండా.. ఆరోపణలతో పాటు విచారణను ఎదుర్కొంటున్న ఆనంద్ కుమార్ ను బీజేపీలోకి తీసుకోవడం అంత ఈజీ ఏం కాదు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే సీఎం రమేష్ వ్యవహరించి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. స్థానిక టీడీపీ నేతల అభ్యంతరాలతో ఆనంద్ కుమార్ ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం కుదరదు.అటు గతంలో ఆనంద్ కుమార్ కుటుంబమంతా సుదీర్ఘకాలం టీడీపీకే సేవలందించింది. ఆ లెక్క తోనే సీఎం రమేష్ .. చంద్రబాబును ఒప్పించి బీజేపీలోకి తీసుకువచ్చారన్న టాక్ నడుస్తోంది.