రోజా.. వైసీపీ ఫైర్ బ్రాండ్. ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చడంలో ముందువరసలో ఉంటారు రోజా. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఈగను కూడ వాలనిచ్చేవారు కాదు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అన్నా.. మీడియా ముందుకు వచ్చి వారిని చెడుగుడాడుకునేవారు. అందుకే వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా రోజా పేరు గడించారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఏఐఐసీ చైర్‌పర్సన్‌గా.. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా పని చేశారు. కానీ కాలం గిర్రున తిరిగింది. వైసీపీ అధికారం కోల్పోయింది. తెలుగు దేశం కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది.
అయితే ఎన్నికల వేళ వైసీపీ చేసిన తప్పులు, అక్రమాలను బయట పెడుతామని.. దానికి సంబంధించిన అధికారులు, నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు ప్రకటించారు. భూ కబ్జాలు, ఇసుక తవ్వకాలు, మైనింగ్, మద్యం, డ్రగ్స్, రేషన్ బియ్యం, కాంట్రాక్టుల విషయంలో అక్రమాలకు పాల్పడి వైసీపీ నేతలు కోట్ల రూపాయలు సంపాదించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం చేసిన తప్పులను, అక్రమాలను బయటపెడుతామని టీడీపీ నేతలు మరింత గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దీంతో తమపై కక్ష్య సాధించేందుకు టీడీపీ కూటమి సిద్ధమవుతోందని అటు వైసీపీ నేతలు అంటున్నారు.
ఏది ఏమయినప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు, కుంభకోణాలకు పాల్పడిన వారు జైలుకు వెళ్లడం ఖాయమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా జైలుకు వెళ్లడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సమయంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ కార్యక్రమాల్లో వందల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 100 కోట్ల రూపాయల స్కామ్ చేశారని విమర్శలొచ్చాయి. క్రికెట్ కిట్లు, ఇతర స్పోర్ట్స్ పరికరాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు పక్క దారి పట్టించారని కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘల నేతలు అప్పట్లో మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు.
అంతేకాకుండా రుషికొండ ప్యాలెస్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. అయిదు వందల కోట్ల రూపాయలతో లగ్జరీగా ప్యాలెస్‌ను నిర్మించారు. అయితే ప్యాలెస్ అవినీతిలో కూడా రోజా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్యాలెస్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ల వద్ద రోజా ముడుపులు తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ డబ్బుతోనే బెంజ్ కారు కూడా కొన్నారని గుసగుసలు వినిపించాయి. కానీ అప్పుడు రోజా ఆ ఆరోపణలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. తనకు బెంజ్ కారులో తిరిగాలనే కోరిక లేదని.. కేవలం తన కొడుకు కోరిక మేరకే బెంజ్ కారు కొన్నామని తెలిపారు. అది కూడా తన సొంత డబ్బులతో కారు కొన్నట్లు వివరించారు. అంతేకాకుండా రోజా పేరు చెప్పుకొని తన సోదరుడు, భర్త దందాలు చేశారని వందల కోట్లు దండుకున్నారని రోజాపై ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులుగా చూసుకుంటే రోజాపై అవినీతి ఆరోపణలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజా అరెస్ట్ తప్పదా? అన్న చర్చ తెరపైకి వచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY