చేసిన తప్పే మళ్లీ చేస్తున్న జగన్

వైసీపీ హయాంలో ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకూ అందరూ టీడీపీ, జనసేన పార్టీలను తిట్టడం ఒకటే టార్గెట్ అన్నట్లుగా రెచ్చిపోయారు. ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకు ఎక్కువ బోనస్ అని అధినేత చెప్పేవారో ఏమోకాని ..ప్రజా పాలనను పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తిడుతూ ఉండేవారు. దాంతో వైసీపీకి వచ్చిన లాభం నయా పైసా లేదు కానీ టీడీపీ, జనసేనకు మాత్రం బాగా ప్లస్ అయింది. వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పిన ఏపీ ప్రజలు టీడీపీ, జనసేనకు ఊహించని అఖండ విజయాన్ని అందించారు.

నిజానికి వైసీపీ, జనసేన పార్టీలు ఒకేసారి ఆవిర్భవించాయి.అయితే పరిస్థితులు అనుకూలంగా లేక జనసేన వెయిట్ చేయగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2019లో అధికారాన్ని అందుకుంది.అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతూ వైసీపీ తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటూ వచ్చింది. చివరకు వైనాట్ 175 అంటూ విర్రవీగే వైసీపీ నేతలకు.. 11 స్థానాలను మాత్రమే ఇచ్చి తిక్క కుదిర్చారు ఏపీ ఓటర్లు.

దీంతో ఎక్కడ తప్పు చేశామో తెలిసిన వైసీపీ పవన్ కళ్యాణ్ మాట ఎత్తకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. సాక్షాత్తూ అధినేత జగనే పార్టీ నేతలకు సీరియస్ గా చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అదే జగన్.. పవన్ గురించి ఎదురయిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని చెప్పడం మరోసారి హాట్ టాపిక్ అయింది. దీనికి వెంటనే మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఘాటుగానే రిప్లై ఇచ్చినా..జనసైనికులు మాత్రం ఇంకా చల్లారలేదు.

మరోవైపు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను తిట్టడం వల్లే జనసేనను టీడీపీకి దగ్గర చేసింది జగన్ మోహన్ రెడ్డేనని విశ్లేషకులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడంతో మెగా అభిమానులు, అప్పటివరకు వైసీపీకి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం కూడా దూరమైంది. ఇది ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన విశ్లేషణలతో కొంత మౌనం దాల్చిన జగన్.. పవన్ పై విమర్శలు చేయడానికి సాహసించలేదు.

అయితే తాజాగా పవన్ ను మరోసారి టార్గెట్ చేయడంతో జగన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇన్ని నెలలు అణిచిపెట్టుకున్న ఉక్రోషాన్ని, అసూయను జగన్ ఇలా బయటపెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ బుద్ధి రాకపోతే జగన్ భవిష్యత్తులో కూడా అధికారం కావాలనుకునే కలలకు ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిందేనని ఇటు విశ్లేషకులు సైతం అభిప్రాయం పడుతున్నారు.