ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎట్టకేలకు సీనియర్ ఐఏఎస్ అధికారి కె. విజయానంద్ నియమితులయ్యారు.దీనిపై ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం డిసెంబ్ 31 తో ముగియనుంది. దీంతో ఏపీ కొత్త సిఎస్ గా విజయానంద్ ను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతోనే ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపారు.
కె. విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నుంచి ఏపీ జెన్కో చైర్మన్ గానూ, 2023 నుంచి ఏపీ ట్రాన్స్కో సీఎండీగానూ విజయానంద్ ఉన్నారు. 1993లో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆదిలాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రంపచోడవరం సబ్ కలెక్టర్ తో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గానూ కూడా విధులు నిర్వహించారు. 2016 నుంచి 2019 వరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా పనిచేసిన ఆయన.. 2019 నుంచి ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవులు నిర్వర్తించి,, తరువాత ఏపీ జెన్కో, ట్రాన్స్కో బాధ్యతలను చేపట్టారు. .
నిజానికి ఈ సీఎస్ రేసులో ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అయితే వారంతా ఇంకా కొంతకాలం సర్వీసులో ఉండనుండటంతో.. వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్న విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. నిజానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యేందుకు అన్ని అర్హతలు ఉండటంతో పాటు.. సీనియర్ జాబితాలో కూడా ఆమె ముందు వరుసలో ఉన్నారు. అయితే వైసీపీ హయాంలో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణల వల్ల.. ప్రస్తుతం ఆమె రిజర్వులో ఉన్నారు.
విజయానంద్ కంటే ముందు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఈయన సర్వీసు 2026 వరకు ఉంది.కానీ విజయానంద్ సర్వీసు మాత్రం మరో 10 నెలల్లో ముగియబోతోండటంతో.. విజయానంద్ కు అవకాశమిచ్చారు సీఎం చంద్రబాబు. జనవరి 1న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి.. 2025 నవంబరు 30 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.