ఏపీని వర్షాల టెన్షన్ వీడటం లేదు. తాజాగా మరో అల్పపీడనం ఏపీ రైతులను భయపెడుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఇది బుధవారానికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారలుు చెప్పారు. ఈ అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 10వ తేదీ అంటే ఈరోజు కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా,అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు చిత్తూరు,తిరుపతి,అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
అయితే వర్షాలు పడుతుండటంతో..ఇప్పటికే వరిపనులు మొదలుపెట్టిన రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని సూచనలు అందించింది. వరి కోతలు,ఇతర వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయకుండా ఉంచాలని ఒకవేళ కోసిన పైరు ఉంటే పూర్తిగా ఆరని పనలను కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల చొప్పున ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవాలి. దీని వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని చెప్పారు.
కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచిపోయినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి ..5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలని సూచించారు. పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు కానీ చెట్లు కానీ పడిపోకుండా నిలబడడానికి కర్రలు లేదా బాదులతో సపోర్ట్ అందించాలని చెప్పారు.