ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక శుభవార్తల మీద శుభవార్తలు వింటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ భయం తొలగిపోవడం, ఆగిపోయిన పోలవరం పనులు స్పీడప్ అవడం, ఐదేళ్లల పాలనలో రాజధాని లేకుండానే పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయాక..అమరావతిలో రాజధాని నిర్మాణానికి వడివడిగా అడుగులు పడటం వంటి ఎన్నో శుభ వార్తలు వరుసగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీ ప్రజలకు మరో కీలక అప్ డేట్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై ఏపీ గవర్నమెంట్ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో ట్రైన్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖపట్నంలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు ఏపీ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నగరాల్లో తొలిదశ పనులకు 11వేల9 కోట్లు రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌లను కేంద్రానికి ఆమోదం కోసం కూటమి ప్రభుత్వం పంపింది. దీనికోసం 100% నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు.
విజయవాడలో 66 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 76.9 కిలోమీటర్లు పొడవునా డబుల్ డెక్కర్ మెట్రో సిస్టంకు ఇటీవల ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించారు. 2017లో ఆమోదించిన పాలసీలో ఉన్న నిబంధనల ప్రకారం, మెట్రో రైలు ప్రాజెక్టు నిధుల వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చర్చించారు. మెట్రో రైలు ప్రాజెక్టులకు 100% కేంద్రం నిధులు ఇవ్వాలని కోరిన చంద్రబాబు.. కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును కూడా 8,565 కోట్ల రూపాయలతో ఇదే పద్ధతుల్లో చేపట్టారని గుర్తుచేశారు.
కాగా ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ట్రైన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. జాతీయ రహదారులపై కింద రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్, దాని పైన మరో 8 మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ విధానం చాలా సిటీలలో ఇప్పటికే విజయవంతంగా అమలులో ఉంది. మరోవైపు ఈ వార్తతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి లేకుండా కూర్చున్న ఏపీకి మళ్లీ మంచిరోజులొచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.