ఏటా వర్షాకాలం.. ఆ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో అందరి చూపూ నేలపైనే ఉంటుంది. ఏదో వెదుక్కుంటూ తిరుగుతారు. ఆ దృశ్యాలు ఈ సంవత్సరం కాస్త ముందే కనిపిస్తున్నాయి. వర్షాలు ముందస్తుగా కురవడమే అందుకు కారణం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలంలో వజ్రాలు దొరుకుతాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అప్పుడెప్పుడో ఓసారి గార్గేయపురానికి చెందిన వ్యక్తికి ఓ వజ్రం దొరికిందని, దానిని అమ్మడం ద్వారా అతడికి 30 లక్షల రూపాయలు వచ్చాయని విస్తృతంగా ప్రచారం సాగడంతో వర్షాలు కురవగానే ఆ ప్రాంతానికి చాలా మంది క్యూ కడుతున్నారు.
జిల్లాకు చెందిన వారే కాకుండా.. బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, శ్రీశైలం, నన్నూరు, ఓర్వకల్లు గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు వజ్రాల కోసం గాలిస్తుంటారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో వర్షాలు పడటంతో వజ్రాల వేట మొదలైంది. పొలాల్లోకి జనాలు వెళుతున్నారు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. తమ పొలం పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల దగ్గర కాపలాగా ఉంటున్నారు.. ఎవరూ అటు వైపు రాకుండా చూస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాలవైపు వజ్రాల వేట కోసం రావొద్దని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఒకవేళ ఎవరికైనా వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా అక్కడే తిష్ట వేశారు. కొందరు వ్యాపారులు తమ మనుషులను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరు కమీషన్ ప్రాతిపదికన కొందరిని నియమించుకున్నారు. తొలకరి జల్లులకు పొలాల్లో వజ్రపు రాళ్లు బయటపడుతుంటాయి. చిన్న రాయి దొరికినా చాలు తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో జనం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. స్థానికంగానేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తూ ఉంటారు. సాధారణంగా జూన్, జూలై మాసాల్లో వర్షాలు పడుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే తొలకరి చినుకులు పలకరించాయి. ఈ నేపథ్యంలో తుగ్గిలి, వజ్రకరూరు పొలాల్లో స్థానికులతో పాటు సమీపంలోని కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెతుకులాట ప్రారంభించారు.
గతంలో చాలా మందికి వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఇవి అధిక ధరకు అమ్ముడుపోయిన సంఘటనలు ఉన్నాయి. అందుకే కొందరికి ఆశ. తమకు ఎప్పటికైనా దొరకకపోతుందా అని. కొందరైతే పనులకు బ్రేక్ ఇచ్చి మరీ వజ్రాల వేట కోసం ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే, జీవితాంతం కూలి చేసినా సంపాదించని డబ్బు పొందొచ్చని వారి నమ్మకం. అలాంటి వారిలో ఉద్యోగులు కూడా ఉంటున్నారు. కేవలం పెద్దలు మాత్రమే కాదు, పిల్లా జల్లా, ముసలి ముతక ప్రతి ఒక్కరూ వజ్రాల వేటలో నిమఘ్నమయ్యారు. ఇప్పుడు ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుండడంతో మున్ముందు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో కూడా వజ్రాల వేట సాగిస్తుండడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY