ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు గత 30 ఏళ్లలో ఎన్నడు రానటువంటి వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయి. దీంతో విజయవాడలో పలు ప్రాంతాలు జలమయమై 2.7 లక్షల మందికి పైగా జనజీవనానికి అంతరాయం కలిగింది. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలకు ప్రభావితమైన అనేక ప్రాంతాల్లో చేరుకుని అక్కడి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ రాత్రంతా మేల్కొని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి బోటులో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో సీఎం చంద్రబాబు పర్యటించారు.
రెండు రోజులుగా నిరంతరంగా శ్రమిస్తూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని వరద సహాయక చర్యలు చేపట్టామని బాధితులకు వివరించారు. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బాధితులకు సిఎం హామీ ఇచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు బుడమేరులోకి చేరి కష్టాలను మరింత పెంచుతున్నాయని సీఎం తెలిపారు. ఈ అత్యవసర పరిస్థితిని దృఢంగా ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్న చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి 9.7 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశామని, 1998లో ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చిందని గుర్తుచేస్తూ.. అది మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం చెప్పారు.
ఇప్పటికే వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చాలాచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వానలతో ప్రజలు వణికిపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడుతాయని అనుకునే లోపే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో తుఫాన్ రాబోతుందనీ.. ఏపీలో వర్షాలు పడబోతున్నాయని తెలిపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, మరోసారి ఆందోళన మొదలైంది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.