శ్రీవారి కళ్యాణోత్సవంపై టీటీడీ తాజా నిర్ణయం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. అది విశిష్టమైన రోజులు అయితే ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని.. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరపడానికి టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే ఆగస్ట్ 14వ తేదీన సాయంత్రం అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. పవిత్రోత్సవాల వెనుక ఓ కథ ఉంది. తిరుమలలో ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు,ఉత్సవాల్లో భక్తుల వల్ల గానీ,ఉద్యోగులు, అధికారుల వల్ల, వేద పండితుల వల్ల కానీ తెలియక కొన్ని కొన్ని దోషాలు జరుగుతుంటాయి.

ఈ దోషాల వల్ల శ్రీవారు కొలువైన తిరుమల ఆలయ పవిత్రతకు ఎలాంటి అపవాదు రానీయకుండా ..ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ప్రతీ ఏడాది ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు కూడా జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1962న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

పవిత్రోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని.. సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి శ్రీవారి భక్తులకు దర్శనమిస్తారు.

ఆగస్ట్ 15వ తేదీన పవిత్రాల ప్రతిష్ట, ఆగస్ట్ 16న పవిత్ర సమర్పణ, ఆగస్ట 17న పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ప్రతీ రోజు జరిగే వివిధ రకాల ఆర్జిత సేవలను ఈ మూడు రోజులు టీటీడీ అధికారులు రద్దు చేశారు. అలాగే అంకురార్పణ కారణంగా ఆగస్ట్ 14వ తేదీన సహస్రదీపాలంకార సేవ రద్దయింది. ఆగస్ట్ 15న తిరుప్పావడతో పాటు 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరోవైపు పవిత్రోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్ట్ 18వ తేదీన జరగనున్న శ్రీవారి కళ్యాణోత్సవాన్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఆలయంలోని సంపంగి ప్రాకారంలో.. వైదిక కార్యక్రమాలను ఆగస్ట్ 17వ తేదీ రాత్రి వరకు నిర్వహించాల్సి ఉండటంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.