పరీక్షల హడావిడి ముగిసింది.. ఇక విద్యార్థులకు ఆనందం పంచే వేసవి సెలవుల సమయం వచ్చింది. ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాక విద్యార్థులు ఎదురు చూస్తున్న బ్రేక్ ఎట్టకేలకు రానుంది. ఈ ఏడాది కూడా వేసవి సెలవులు గణనీయంగా ఉండబోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలలు ఏప్రిల్ 24 వరకు పనిచేసిన తర్వాత, ఏప్రిల్ 27న అధికారికంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల్లోనూ జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి, జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
గత ఏడాదిలాగే ఈసారి కూడా తీవ్రమైన ఎండలు కారణంగా సెలవుల తేదీలు మారే అవకాశం లేకపోలేదు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, సాధారణంగా వేసవి సెలవులు మే నెల మొత్తాన్ని కవర్ చేస్తాయి. విద్యార్థులు సుదీర్ఘ విరామాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవ్వచ్చు.
ఇంటర్ విద్యలో కీలక మార్పులు
ఇక ఇంటర్మీడియట్ విద్యలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభ తేదీల్లో మార్పులు చేయాలని యోచిస్తోంది. సాధారణంగా జూన్ 1న మొదలయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఏప్రిల్ 1న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 24 నుంచి తరగతులు మొదలవుతాయని సమాచారం. మే నెలలో విద్యార్థులకు విరామం ఇవ్వనుండగా, జూన్ 2న మళ్లీ కాలేజీలు ప్రారంభం అవుతాయి.
ఈ మార్పులతో విద్యా సంవత్సరానికి 235 రోజులు తరగతులుండగా, ఇతర సెలవులు 79 రోజులు ఉంటాయని అంచనా. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.