ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందన్న విషయంలో మరోసారి గుర్తు తెచ్చుకునేలా చేశారు .. నారా భువనేశ్వరి. తన భర్త చంద్రబాబు కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటానికి 2024లో రాజకీయపరంగా తగిన గుర్తింపు లభించింది. ఏపీతోపాటు జాతీయ రాజకీయాలను శాసించిన మహిళగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి గుర్తించబడ్డారు. నిజానికి వైసీపీ పాలనలో ఆమె ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రత్యర్థులు ఆమెను టార్గెట్ చేసినా.. వాటిని ధైర్యంగా అధిగమించగలిగారు.
గతేడాది సెప్టెంబర్‌లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . కనీసం ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయించి.. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండేలా చేశారు. ఆ సమయంలో భార్య భువనేశ్వరి ధైర్యాన్ని కూడగట్టుకుని, బాధను దిగమింగుకొని పోరాట బాట పట్టారు. తన భర్త విషయంలో వైసీపీ చేసిన తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటివరకు రాజకీయ వేదికలు పంచుకోని ఆమె.. ఏపీవ్యాప్తంగా పర్యటనలు చేశారు. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ..ప్రజలతో కలిసి తన బాధను చెప్పుకుని వారిని చైతన్యం చేశారు. అధినేత అరెస్టుతో డీలా పడిన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు భువనేశ్వరి.
2024లో కూటమి ఘనవిజయం సాధించడంతో..ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు ప్రజలతో పెనవేసుకున్న ఎన్టీఆర్ కుమార్తెగా కంటే.. చంద్రబాబు భార్య గానే భువనేశ్వరి ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా.. తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు జిల్లాల పర్యటనలు చేస్తూ మహిళలతో మమేకం అవుతున్నారు. రాజకీయ వేదికలు పంచుకుంటున్న భువనేశ్వరి భవిష్యత్తులో తాను రాజకీయాల్లో అడుగు పెట్టనంటూ తేల్చి చెబుతున్నారు.