ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పూరీ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడులతో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లా 2 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ 1ఎస్డీఆర్ఎఫ్,తూర్పుగోదావరి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు విపత్తుల సంస్థ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్షించారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ