ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 13న జీవో జారీ చేసింది.ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం రీలీవ్ చేసిన తెలంగాణ ఉద్యోగులు తమ కేడర్ చివరి ర్యాంక్‌లోనే విధుల్లోకి చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జులై 6న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విభజన సమయం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల వినతులపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి .. చివరకు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను.. రిలీవ్ చేయాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు గతంలో అనేకసార్లు ఏపీ ప్రభుత్వానికి వినతులు అందించారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత ఉన్న కొంతమంది ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. వారిలో కొంతమంది ఇప్పటికే తెలంగాణకు వెళ్లగా, మిగిలిన వారు ఏపీలోనే పనిచేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లైనా తమ సమస్యలను ఇంకా పరిష్కరించలేదని తెలంగాణ ఉద్యోగులు చాలాసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణకు చెందిన 122 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారని, వారిని రిలీవ్ చేయాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు కూడా ఇటీవల ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో నీరబ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో సంఘం నేతలు..ఉద్యోగుల రిలీవ్‌పై వినతులు సమర్పించారు. మొత్తంగా తెలంగాణ ఉద్యోగులు తమ స్వస్తలాలకు చేరుకుంటారన్న వార్తతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.