మావోయిస్టుల అడ్డాలో నిర్భయంగా అడుగుపెట్టిన పవన్..

Pawan Fearlessly Entered The Maoist Camp

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. తాజాగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన పవన్.. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే కృత నిశ్చయాన్ని పెట్టుకున్నారు. దీనికోసం స్వయంగా గిరిజన గ్రామాలకు వెళ్లి గిరిజనులతో మమేకం అవుతున్నారు. ఒకేసారి గిరిజన ప్రాంతాల్లో 200 రహదారులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నారు. అయితే ఏకంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి.. డిప్యూటీ సీఎం హోదాలో ఈ పనులకు పవన్ శ్రీకారం చుడుతుండడంతో అందరి చూపూ అటే ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలయినా సరే లెక్క చేయకుండా పవన్ పర్యటించడంతో గిరిజన సంక్షేమంపై డిప్యూటీసీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈరోజు అంటే సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన పవన్.. అక్కడ నుంచి రోడ్డు మార్గం నుంచి అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం చాపరాయి చేరుకున్నారు. అక్కడ నుంచి 3 కి.మీటర్ల దూరంలో ఉన్న గిరిజన ఆవాస ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ అడవి తల్లి బాట పేరుతో రహదారులకు శంకుస్థాపన చేసి.. అక్కడ నుంచి డుంబ్రిగూడ మండల కేంద్రానికి చేరుకుని.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించిన 200 రోడ్లకు పర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు పవన్.

ఆ తర్వాత అరకు వెళ్లి ఈరోజు రాత్రికి అక్కడ ఓ రిసార్ట్స్ లో బస చేస్తారు. రేపు కూడా డిప్యూటీ సీఎం అరకు ప్రాంతంలోనే ఉంటారు. అరకు సమీపంలోని సుంకరమెట్టలో చెక్కలతో తయారు చేసిన వంతెనను పవన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత అరుకు కాఫీ తోటలను కూడా సందర్శిస్తారు. అక్కడ నుంచి నేరుగా విశాఖకు చేరుకుని అక్కడ ఇందిరాగాంధీ జియో లాజికల్ పార్క్ కు వెళ్లి ఎకో టూరిజానికి సంబంధించి ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు.

రెండు రోజుల పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో బాక్సైట్ అనుమతులకు నిరసనగా మావోయిస్టులు ప్రజాప్రతినిధులను దండించిన సందర్భాలు చోటుచేసుకోవడంతో..ఆ తర్వాత ఏ డిప్యూటీ సీఎం కానీ, మంత్రి కానీ ఈ పరిసరాలలోకి వెళ్లే సాహసం కూడా చేయలేదు. అటువంటి చోటకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్భయంగా వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అత్యంత సన్నిహితుడుగా పవన్ గుర్తింపు పొందారు. తాజాగా మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉక్కు పాదం మోపింది. ఇలాంటి సమయంలో.. పవన్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో.. ఇటు ఏపీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.