వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం పై వస్తున్న విమర్శలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. నేను బయటకు రాలేదు అనే విమర్శలు అనవసరం. నేనూ పర్యటించాలని అనుకున్నా. నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు. నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బయటకు వస్తేనే కాదు, నేను చేసే పనులు అధికార యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. అధికారులు 72 గంటలుగా కష్టపడుతున్నారు. నేను పర్యటనకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే వరద ప్రాంతాలకి వెళ్లలేదు. నేను వెళ్లడం బాధితులకు సాయంగా ఉండాలే తప్ప, ఆటంకం కాకూడదు అని పవన్ అన్నారు. నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు. అంతే తప్ప ఇంకేం ఉండదు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ చేయడమే ముఖ్యం అని పవన్ వెల్లడించారు.
30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని డిప్యూటీ సీఎం విమర్శించారు. గతంలో అన్నమయ్య డ్యామ్ కూడా వైసీపీ నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిందన్నారు. ఇక విజయవాడలో బుడమేరు పొంగిపోర్లటంతో విపరీతమైన నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం బుడమేరు నుంచి ఔట్ లెట్ కెనాల్స్ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వర్షాలు తగ్గిన వెను వెంటనే బుడమేరు నుంచి వరద సమయాల్లో నీళ్లు వెళ్లిపోవడానికి ఔట్ లెట్ కాలువలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పుడూ లేనంతగా వర్షాలు, వరద రావడం కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారన్నారు. మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు.