తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలనదేనన్నారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను” అని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
గత పాలకుల వికృత చర్యల ఫలితంగా తిరుమల లడ్డూ ప్రసాదం అపవత్రమైందన్నారు పవన్. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. జంతు అవశేషాలతో మలినమైందన్నారు. ఈ పాపాన్ని ముందుగా పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం అన్నారు. ఏడుకొండలవాడా క్షమించు అని రాసుకొచ్చారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి చర్య తన దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అన్నారు.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని డిప్యూటీ సీఎం అన్నారు. తన బాధేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం అని ఆవేదన చెందారు. నాటి పాలకులకు భయపడి నోరు విప్పకుండా ఉండిపోయారా? అనిపిస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
కాగా సీఎం చంద్రబాబు కూడా తాను ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతానని చెప్పారు. తమ ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని అన్నారు. తన చిన్నతనంలో తన ఇంటి దగ్గర నుంచి చూస్తే తిరుమల కొండ కనిపించేదని చెప్పారు.”ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..మనం నిమిత్త మాత్రులం..దేవుడే అన్నీ చేయిస్తాడు.. ఇదీ అంతే అనుకుంటున్నా” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.