మరోసారి బయటపడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం

డబ్బు చాలా మందికి ఉంటుంది. అధికారం చాలా మందికి వస్తుంది. కానీ కష్టం చూసి స్పందించే మనసు మాత్రం అతికొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి మనసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందని అతని సన్నిహితులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి కూడా పవన్ ఈ మాటలను నిజం చేశారు. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు.వారి రోడ్డు కష్టాలను తీర్చడానికి అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన కూడా చేశారు.

పవన్ కళ్యాణ్ పెదపాడు గ్రామానికి వెళ్లగానే.. పాంగి మిత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్లి డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికింది. ఆమె వెనుక మరింత మంది వెళ్లి దింసా నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాలతో పవన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే సమయంలో పాంగి మిత్తుతోపాటు అక్కడ గిరిజన ఆడబిడ్డలు, వృద్ధులే కాదు పిల్లలు కూడా ఎటువంటి పాదరక్షలు ధరించకుండా ఉండడాన్ని గమనించారు . అడవి తల్లి బాట సందర్బంగా పవన్ కళ్యాణ్ అక్కడివారితో కలిసి నడిచారు. వారితో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

అప్పుడే పవన్ కు ఆదివాసీలకు రహదారుల మాట దేవుడెరుగు కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటున్న పరిస్థితిని .. కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితిని అర్ధం చేసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా.. కాళ్ల రక్షణ కోసం చెప్పులు కొని వేసుకున్నా.. అక్కడ రోడ్డు సదుపాయం లేక కొండలగుట్టలు దిగే సమయంలో రెండు రోజులకే తెగి మూలన పడిపోతుంటాయన్న సంగతిని గ్రహించారు. దీంతో వీరిలో చాలామంది మహిళలు రాళ్లు రప్పలపై నుంచి కిలోమీటర్ల మేర ఎండనక, వాననక ప్రయాణం చేస్తూ ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో తెలుసుకున్నారు.

రోడ్లు సక్రమంగా లేని దారిలో ముళ్లు, రాళ్లు ఉండటాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అటువంటి రహదారుల్లో కనీసం కాలికి చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించి పోయిన సీఎం అక్కడ వెంటనే సర్వే చేయించారు. స్థానికంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందితో ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు..వారి చెప్పుల సైజు ఏంటనే వివరాలను సేకరించారు. ఈలోగా తన కొడుకు మార్క్ శంకర్‌కు స్కూలులో ప్రమాదం జరగడం, వెంటనే పవన్ సింగపూర్ వెళ్లడం , తర్వాత పవన్ హెల్త్ పాడవడం జరిగిపోయాయి.

ఇంత బిజీలో కూడా పెదపాడు గ్రామస్తుల చెప్పుల సంగతి మాత్రం డిప్యూటీ సీఎం మరిచిపోలేదు.పది రోజులు పూర్తిగా కాకుండానే.. పెదపాడు గ్రామానికి పాదరక్షలు పంపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది , మరి కొంతమంది సభ్యులు ఆ గ్రామానికి వెళ్లి.. స్థానిక సర్పంచ్ వెంకటరావుతో కలిసి.. ప్రతి ఇంటికి వెళ్లి గిరిజనులను పలకరించి పవన్ కళ్యాణ్ పంపించి చెప్పులను పంపిణీ చేశారు.

అలా ఆ గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందజేశారు. దీంతో ఆ కొత్త చెప్పులు వేసుకుని అడవి బిడ్డలు చిరునవ్వులు చిందిస్తున్నారు. మా మంచి సారు.. చెప్పులు పంపారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పవన్ దృష్టిలో ఈ సాయం చిన్నదే కానీ వారి అవసరాన్ని గమనించి అందించిన సాయం చేసే మనసు కొద్ది మందికే ఉంటుందని..అది తమ నాయకుడికి ఎప్పుడూ ఉంటుందని జనసైనికులు ఉప్పొంగిపోతున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పదివేల మంది మహిళలకు చీరల పంపిణీని చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు.