అమరావతి రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న కూటమి ప్రభుత్వం.. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేయాలని అనుకుంటోంది. అన్ని విధాల సహకారం అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం .. వార్షిక బడ్జెట్లో ఏకంగా రూ. 15 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. దీనికోసం ప్రపంచ బ్యాంకుతో పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కేంద్రప్రభుత్వం సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. దానిలో తొలి విడత రుణానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. మరోవైపు హడ్కో రుణాన్ని కూడా మంజూరు అయింది. ప్రధాని నరేంద్ర మోదీతో పనులు పున ప్రారంభించడానికి నిర్ణయించారు.
ముఖ్యంగా ఐకానిక్ భవనాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నవ నగరాలు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్న సీఎం దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ హైవేలో అమరావతికి స్వాగతం పలికేలా.. భారీ ఎంట్రీ ఉండేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇంకో వైపు 36 అంతస్తుల ఎన్.ఆర్.టి ఐకానిక్ భవన నిర్మాణంపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం 600 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని జరపనున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా చేయాలనే లక్ష్యంగా.. అమరావతిని 360 డిగ్రీలలో వీక్షించేలా ప్రణాళిక ఉంది.
ఏప్రిల్ చివరి వారంలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ..మంచి ముహూర్తం చూసి పనులను ప్రారంభించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యానికి మరోసారి శ్రీకారం చుట్టం చుట్టనున్నారు. ఈ ఎన్నార్టీ ఐకానిక్ భవనం నిర్మాణానికి టెండర్లు కూడా పిలవగా… ఈ నెల 10 వరకు టెండర్లకు గడువు ఉంది. ఐదు ఎకరాల్లో నిర్మించబోయే ఎన్నార్టీ ఐకాన్ భారీ భవనాన్ని పోడియం తో కలిపి 36 అంతస్తుల్లో నిర్మిస్తారు. దీని నిర్మాణం మూడు దశల్లో ఉండగా… మొదటి దశకు సంబంధించి ఫౌండేషన్‌కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ జంట టవర్ల నిర్మాణం 2028కి పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టారు సీఎం చంద్రబాబు.
అయితే ఎన్నారైల కోసమే ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రవాస ఆంధ్రులకు ప్రాధాన్యం ఇచ్చేలా నిర్మించబోయే ఈ భవనంలో.. నివాస ప్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లార్‌తో పాటు దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తారు. రెండు టవర్లలోను ఒక్కదానిలో 29 అంతస్తులు ఉండగా.. మొదటి టవర్ లోని 29 అంతస్తుల్లో ఒక్క అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో మాత్రం కార్యాలయాలు ఏర్పాటవుతాయి. రెండు టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. 360 డిగ్రీలు అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చనని అధికారులు చెబుతున్నారు. గ్లోబ్ లో 10 నుంచి 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు.