ఈవీఎం ధ్వంసం కేసు.. పిన్నెల్లి అరెస్ట్

evm, Police, former MLA Pinnelli Ramakrishna Reddy, Pinnelli Ramakrishna Reddy arrest
evm, Police, former MLA Pinnelli Ramakrishna Reddy, Pinnelli Ramakrishna Reddy arrest

ఏపీ ఎన్నికల వేళ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి  రామకృష్ణా రెడ్డి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం మిషన్‌ను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేయడం వివాదాస్పదం అయింది. ఈ వివాదానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అనంతరం భారీ భద్రత మధ్య పిన్నెల్లిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

మే 13న పోలింగ్ సమయంలో మాచర్లలోని పాల్వాయిగేటు 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్‌లోకి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వెళ్లారు. అక్కడున్న అధికారులు అడ్డుకున్నప్పటికీ.. ఓ ఈవీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. ఆ పోలింగ్ స్టేషన్‌లో అమర్చిన వెబ్ కెమెరాలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలో పిన్నెల్లి చర్యలను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఈసీ కోరింది.

ఈక్రమంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన పూర్తి రిపోర్టును ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈసీకి పంపించారు. ఈ రిపోర్టులో ప్రధాన నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పేరును చేర్చారు. ముఖేష్ మీనా సమర్పించిన రిపోర్టును పరిశీలించిన ఈసీ.. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈక్రమంలో పోలీసులు పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకంటే ముందు పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో నాలుగు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. గురువారం ఆ పిటిషన్లను కొట్టిపారేసింది. బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆ మరునాడే పోలీసులు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ