ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..

Prime Minister Modi Met CM Chandrababu

రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో ఆయన చర్చలు జరిపారు. వీరి మధ్య దాదాపుగా గంట పాటు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలవరం, అమరావతి నిధులతో పాటు ఇతర అంశాలుపై చర్చలు జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటితో పాటు తాజా రాజకీయ  పరిణామాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ అధ్యాత్మిక కేంద్రం అయిన తిరుపతిలో శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూనూ కల్తీ చేసిన వైనంపై ఓ నివేదిను మోదీకి చంద్రబాబు సమర్పించినట్లుగా చెబుతున్నారు. దాదాపు గంటసేపు జరిగిన చర్చల తర్వాత చంద్రబాబు ఇతర కేంద్రమంత్రుల్ని కలిసేందుకు బయలుదేరి వెళ్లిపోయారు.

హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ  పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చంద్రబాబునాయుడు అత్యంత ముఖ్యమైన పార్టనర్. బీజేపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీ టీడీపీ. ఈ కారణంగా జాతీయ రాజకీయాల్లో రాబోతున్న  మార్పులు.. త అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినటలుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం పెండింగ్ సమస్యలుగా ఉన్న అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదనపై ప్రధాని మోడీతో చంద్రబాబు చర్చించారు. ప్రపంచ బ్యాంక్ రుణంపై సూత్రప్రాయంగా ఆమోదం లభించిన నేపథ్యంలో కేంద్రం వైపు నుంచి తీసుకోవాల్సిన ఇతర చర్యలపై చంద్రబాబు చర్చించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాజాగా ప్రతిపాదించిన రీయింబర్స్ మెంట్ మొత్తం విడుదలపైనా చర్చలు జరిగాయని తెలుస్తోంది.

దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా సెయిల్ లో విలీనం చేసేందుకు వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేలా చంద్రబాబు ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇన్ ఫ్రా ప్రాజెక్టులకు కావాల్సిన సాయంపైనా చంద్రబాబు ప్రధాని మోడీ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. వీటిపై ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడాలని ప్రధాని మోడీ సూచించినట్లు సమాచారం. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు.