ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం మారాక కూడా వైసీపీ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు ప్రారంభించింది. వైసీపీ కోవర్టులుగా కొందరు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఉండటంతో.. ఇప్పుడు ఏపీ సచివాలయంలో ప్రక్షాళన దిశగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ పాలనా కేంద్రమయిన సచివాలయంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన ప్రారంభించింది. వైసీపీ పాలనలో కీలక శాఖల్లో ముఖ్య హోదాల్లో ఉన్న ఉద్యోగులకు స్థాన మార్పు మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా కొన్ని శాఖల్లో వైసీపీ కోవర్టులు పని చేస్తున్నారనే అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కొందరు మంత్రులు ఈ సందేహాన్ని వ్యక్తం చేసారు. దీంతో, ఇలాంటి వారు ఉంటే గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ ను ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో, సచివాలయంలో శాఖల వారీగా నివేదికలు కోరిన సీఎస్.. సుదీర్ఘ కాలంలో ముఖ్య శాఖల్లో కీలక హోదాలో కొనసాగుతున్న వారి సమాచారం సేకరించారు. సుదీర్ఘ కాలంగా కీలక హోదాల్లో కొనసాగుతన్న వారిలో కొంతమందిని స్థాన చలనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ముఖ్య శాఖలకు సంబంధించి 13 మందిని వారి ప్రస్తుత స్థానాల నుంచి మార్పు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు. అందులో ఆరుగురిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.
తాజాగా ఆర్దిక శాఖలో బిల్లుల చెల్లింపు విషయంపై చర్చ జరిగింది. మంత్రికి తెలియకుండానే వైసీపీ హాయాంలో పనులు చేసిన పులివెందుల కాంట్రాక్టర్లకు ఈ బిల్లులు చెల్లించినట్లు తేలింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఈ బిల్లులు క్లియర్ అయినట్లు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే.. గతంలో తమ హయాంలో పనులు చేసిన వారి పెండింగ్ బిల్లులు చెల్లింపు వ్యవహారం కలకలం రేపింది. దీంతో, మొత్తంగా అధికారులు,ఉద్యోగుల పని తీరు,వ్యవస్థ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.