దేశవ్యాప్తంగా రుతుపవనాలు వెనక్కి తగ్గినా.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రకారం అక్టోబరు 7 నుంచి 11వ తేదీ వరకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్,ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.
వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. దీంతో పాటు అస్సాం, మేఘాలయాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో అక్టోబర్ 7వ తేదీన నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రంలోని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలోని పలు ప్రాంతాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో కూడా వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అంతేకాకుండా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ 9 వరకు అకస్మాత్తుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి,నారాయణపేట,మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మరోవైపు ఏపీలో కూడా మూడు రోజులు వానలు ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కర్నూలు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.