అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో..ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో పాటు.. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి ఉపరితల ఆవర్తనం 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 18 గంటలలో పశ్చిమం వైపు కదులుతూ బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో.. తూర్పు, ఆగ్నేయ దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి.
ఏపీలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, కాకినాడ, కోనసీమ, పల్నాడు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు దేశంలో ఈ వారం వాతావరణంపై ప్రకటన చేసిన ఐఎండీ.. ఈ వారం దేశంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 15 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశమున్నట్లు తెలిపింది. డిసెంబర్ 15 వతేదీ తర్వాత దట్టమైన పొగమంచు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. యాక్టివ్ వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ వల్ల ఉదయాన మంచుకురవడం పెరుగుతుందని ఐఎండీ వెల్లడించింది.
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక, కోస్తా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడటంతో.. రాబోయే 2 రోజుల్లో ఇది అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే 18 గంటలల్లో అల్పపీడనం గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేసింది.ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, కేరళ, కోస్టల్ కర్ణాటక, కర్ణాటక, కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్, గోవా, విదర్భ, దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.