వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించడంతో..ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. విజయసాయి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులను వదులుకోవడమే కాకుండా.. మరో మూడున్నర ఏళ్ల రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాతో కచ్చితంగా ఈ రాజ్యసభ సీటు కూటమికి దక్కుతుంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో.. కూటమి నేతలకు అవకాశం ఉంది. ఈసారి జనసేనకు చాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో తప్పుకున్న వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మస్తాన్ రావు తో పాటు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. ఆర్ కృష్ణయ్య బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఇటీవల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ముందుగా కూటమిలోని మూడు పార్టీలు మూడు పదవులను సర్దుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకోగా.. బీజేపీ ఒకటి తీసుకోవడంతో.. జనసేనకు చాన్స్ లేకుండా పోయింది.
టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుతో పాటు సానా సతీష్ కు పదవి దక్కగా… బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య తిరిగి ఎన్నికయ్యారు. అయితే చివరి వరకు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపించినా అవకాశం మాత్రం దక్కలేదు. కానీ తర్వాత.. రాజకీయ సమీకరణలో భాగంగా నాగబాబుకు అవకాశం దక్కలేదని.. ఆయనను ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశం ఇచ్చి.. తరువాత క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు నాగబాబుకు రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. మారిన పరిస్థితులలో నాగబాబు రాజ్యసభకు పంపి.. ఏపీలో మరో బీజేపీ నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఏపీ మంత్రి కంటే రాజ్యసభకు వెళ్లాలనేదే నాగబాబు కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తొలినుంచి పెద్దల సభకు వెళ్లాలని నాగబాబు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీలో మరొకరికి మంత్రి పదవి ఖాయం అయినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంతో.. ఆ పార్టీకి చెందిన సత్య కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. ఇప్పటివరకు ఏపీ మంత్రివర్గంలో ఉంటారనుకున్న నాగబాబు.. రాజ్యసభకు వెళ్లనున్నారు.