మాజీ మంత్రి కొంతకాలంగా ఆర్కే రోజా సైలెంట్ గా ఉంటున్నారు. మునుపటి దూకుడు ఎక్కడా కనిపించడం లేదు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే ఆమె..మాట వరసకు కూడా అగౌరవ వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా ఒక రకమైన ఫ్రెండ్లీ వాతావరణాన్ని అలవరచుకుంటున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు ప్రమాదానికి గురైనపుడు కూడా రోజా స్పందించి.. పవన్ కళ్యాణ్ కు సానుభూతి తెలిపారు.ఇలాంటి సమయంలో రోజా ఓ మంత్రి ఇంటికి వెళ్లినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అది రాజీ కోసమేనని.. రెడ్ బుక్ కు భయపడే ఇప్పుడు ఆమె రాజీ ఫార్ములాకు వచ్చినట్లు రచ్చ జోరుగా సాగుతోంది.
నిజానికి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిపై రోజా ఈగ వాలనిచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్‌ను పర్సనల్ గా టార్గెట్ చేసి చులకన చేసి మాట్లాడే వారు. చంద్రబాబు వయసును కూడా గౌరవించేవారు కాదు.ఇక లోకేష్ సంగతి చెప్పనవసరం లేదు. అటువంటి రోజా వ్యవహార శైలిలో ఇటీవల మార్పు చోటుచేసుకుందని సొంత వర్గంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నా.. ఘాటైన విమర్శలకు మాత్రం రోజా దూరంగా ఉండిపోవడం వైసీపీ వర్గీయుల్లోనే ఆశ్చర్యం కనిపిస్తోంది.
ఇదంతా పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజా కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తించారు. క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉండగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.అయితే ఆసమయంలో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్న ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగానే అవినీతి జరిగినట్లు గుర్తించింది. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో అప్పటి మంత్రిగా ఉన్న రోజాపైనే ప్రధానంగా ఆరోపణలు ఉండటంతో ..దీనిపై కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే రోజా వ్యవహార శైలిలో మార్పు వచ్చిందన్న టాక్ ఇప్పుడు నడుస్తోంది. దూకుడుగా ఉన్న ఆమె అందుకే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని.. మీడియా ముందుకు పెద్దగా కనిపించడం లేదని..చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా రాయలసీమకు చెందిన మంత్రిని ఆమె విజయవాడలో ప్రత్యేకంగా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. క్రీడల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తుండటంతో తనను గట్టెక్కించే ప్రయత్నాలు చేయమని మంత్రిని కలుసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనను ఆడదాం ఆంధ్ర అవినీతి ఇబ్బందుల నుంచి బయటపడి వేయాలని రోజా అభ్యర్థించినట్లు ప్రచారం జరుగుతోంది.కానీ ఐదేళ్లుగా రోజా వ్యవహార శైలి బాగా తెలిసిన ఆ మంత్రి.. ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని చేతులెత్తేసారని… దీంతో అక్కడ నుంచి దిగులుగా బయటకు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.