
ఏపీలోని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు మొదలయిన రాజకీయ రగడ ఇప్పుడిప్పుడు సద్ధుమణుగుతోంది. ఘర్షణలతో మూడు రోజులుగా అట్టుడుకుపోయిన పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే మెల్లగా తేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులంతా పెద్ద ఎత్తున మోహరించి శాంతిభద్రతలను దాదాపు అదుపులోకి తీసుకువచ్చారు.
మంగళవారం రాత్రి నుంచీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే మకాం వేశారు. వీరితో పాటు అదనపు బలగాలను పెద్ద సంఖ్యలో మోహరింపజేసి తాజా పరిస్థితిని చక్కదిద్దారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో.. ఈ రోజు ఉదయం నుంచి పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు తెరుచుకున్నాయి.
అయితే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే ఎస్పీ బిందు మాధవ్ ప్రకటించారు. దీంతో పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో మాత్రం భారీగా పోలీసులు మోహరించే ఉన్నారు. మాచర్ల పట్టణంలో 1500 మందికి పైగా పోలీసు బలగాలను మోహరింపజేసి.. 144 సెక్షన్‌ను కూడా అమలు చేస్తున్నారు. పట్టణంలోకి ఎంటర్ అయ్యే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసే అనుమతిస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసులు.. గ్రామాల్లోనూ పికెటింగ్ కొనసాగిస్తున్నారు.
కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నరసరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనల్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అల్లర్లు జరిగే చోట 144 సెక్షన్ అమలు చేశామని, ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. అల్లర్లు వెనుక రాజకీయ నేతలు ఉన్నారంటూ..వారు తమ అనుచరులను రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు చెలరేగుతున్నాయంటూ వారిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY