సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత ఏడాది సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో దానికి అనుగుణంగా 5246 బస్సులను నడిపింది. గత సంక్రాంతి అనుభవం వల్ల ఈసారి ఏకంగా 6432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
జనవరి 9 నుంచి 15వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు నడిపే ప్రత్యేక బస్సులు.. ముఖ్యంగా విశాఖ పట్నం, విజయవాడ, అనకాపల్లి, అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుప్రయాణానికి ఇబ్బందులు పడకుండా వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి కూడా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తుంది. సంక్రాంతి ఆపరేషన్స్ టీజీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, దీనికోసం పూర్తిగా సిద్ధం కావాలని అధికారులకు ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో సంక్రాంతికి కూడా ఉంటుందని తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను కచ్చితంగా తీసుకోవాలని వివరించింది.