ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం (టీడీపీ,జనసేన,బీజేపీ) అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ముఖ్యంగా, సంఖ్యాపరంగా టీడీపీ-జనసేన పార్టీలదే పైచేయి. గత ఎన్నికలకు ముందే జట్టు కట్టిన ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీతో కలిసి పోటీచేసి నాడు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఈ క్రమంలో టీడీపీ-జనసేన పార్టీల మధ్య మంచి సఖ్యత ఏర్పడింది. ముఖ్యంగా ఇరుపార్టీలలోని ముఖ్య నాయకులు సోదరభావంతో మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, హిందూపురం శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వీరి మధ్య మైత్రికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇరువురూ, సినీ పరిశ్రమకు చెందినవారు కావడం, తొలినుండీ పరిచయం ఉండటం, అలాగే రాజకీయంగానూ దోస్తీలో ఉండటంతో వీరి మధ్య మంచి బాంధవ్యం ఉందని సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీ రామారావు (NTR) విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య పవన్ ని ఉద్దేశించి ‘తమ్ముడు’ అని సంభోదించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ హాజరవడంతో వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.
విగ్రహావిష్కరణ ముఖ్యాంశాలు
-
ఘనస్వాగతం: కొత్తపల్లి క్రాస్ నుంచి ర్యాలీగా వచ్చిన బాలకృష్ణకు అభిమానులు పూలవర్షం కురిపించారు. ఆపిల్స్‌తో చేసిన భారీ గజమాలతో సత్కరించి నీరాజనం పలికారు.
-
కార్యక్రమం: ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్న బాలకృష్ణ, అభిమానుల కేరింతల మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బాలకృష్ణ ప్రసంగంలోని కీలక అంశాలు
-
ఎన్టీఆర్ పాత్ర: ఆంధ్రరాష్ట్ర రాజకీయ చరిత్రను తిరిగిరాసిన మహనీయుడు, పొలిటికల్ హీరో ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.
-
బడుగు వర్గాలకు రాజ్యాధికారం: ఎన్టీఆర్ రాకముందు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ పదవులు దక్కలేదన్నారు. టీడీపీని స్థాపించిన తరువాత ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేసి, అన్ని వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టారని ఉద్ఘాటించారు.
-
సినీ కెరీర్: సినీ చరిత్రలో 50 ఏళ్లు హీరోగా రాణించిన ఘనత తనదన్నారు. మరో 20 సంవత్సరాలు హీరోగా నటిస్తూనే ఉంటానని ప్రకటించారు.
-
టీడీపీ పాలన: ఎన్టీఆర్ ఆశయాలే లక్ష్యంగా, ఆయన కలలను సాకారం చేస్తూ ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
-
ప్రస్తుత నాయకత్వం: నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కల్యాణ్, పెద్దల్లుడు నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తోందని బాలకృష్ణ ప్రశంసించారు.




































