
తాడిపత్రిలో ఎన్నికల సమయంలో రేగిన హీట్ ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ రోజు, ఆ మర్నాడు చెలరేగిన అల్లర్లతో జేసీ కుటుంబంతో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి వెళ్లొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో..పోలింగ్ తర్వాత రోజు నుంచి ఈ రెండు కుటుంబాలు తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పడింది.దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి సైతం తాడిపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
చివరకు అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత జేసీ కుటుంబం తాడిపత్రికి చేరుకుంది.అది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి మరణంతో జేసీ కుటుంబం తాడిపత్రిలోకి అడుగు పెట్టే పరిస్థితి వచ్చింది. తాడిపత్రిలోకి జేసీ ఫ్యామిలీ ఎంట్రీ అవడంతో..ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఎప్పుడు అని వైసీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పెద్దారెడ్డికి కూడా కోర్టు ఆదేశాలు, ఆంక్షలు సడలిస్తే.. ఆయన తాడిపత్రిలోకి వస్తే పరిస్థితి ఏంటనే చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది
దాదాపు 45 రోజులు తర్వాత జేసీ కుటుంబ సభ్యులు తాడిపత్రిలో కాలు మోపారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటన వల్ల తాడిపత్రి వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ పొడిగిస్తూ వచ్చింది. కానీ జూన్ నెల 30న జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి సుజాత ఆకస్మికంగా మరణించడంతో..మరణానంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన కార్యక్రమాల కోసం హైకోర్టు జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి బెయిల్ పొడిగిస్తూ జులై 14 వరకు తాడిపత్రిలో ఉండటానికి అనుమతినిచ్చింది.
ఒకవేళ జులై 14న జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై తాడిపత్రి రాకుండా ఉన్న ఆంక్షలను హైకోర్టు ఎత్తివేస్తే, కేతిరెడ్డి పెద్దరెడ్డి కూడా తాడిపత్రిలో అడుగుపెడతారు. అదే జరిగితే మళ్లీ తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనో అన్న టెన్షన్ అక్కడి వారిలో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు అప్పట్లో తాడిపత్రిలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. చివరకు హైకోర్టు జోక్యంతో జేసీ కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం తాడిపత్రి విడిచి వెళితే గాని అక్కడి పరిస్థితి అదుపులోకి రాలేదు. వందల సంఖ్యలో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదవడంతో పాటు కొంతమందిపై రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి.
అలా 45 రోజులు పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న తాడిపత్రిలోకి.. జేసీ కుటుంబం మళ్లీ రావడంతో పోలీసులు ముందస్తుగానే అలెర్టయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటితో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జులై 14 తర్వాత ఆంక్షలు సడలిస్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి వస్తే.. ఎదురయ్యే పరిస్థితిని అంచనా వేసి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. దీంతో తాడిపత్రిలో మళ్లీ యుద్ధ వాతావరణం తప్పదా అని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE