విజయవాడ వరదల్లో నీట మునిగిన ఇళ్ల బాధితుల కోసం ప్రభత్వం పరిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పూర్తిగా నీట మునిగిన ఇళ్ల విషయంలో ప్రభుత్వం మరింత ఉదారంగా ఉండాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాంటి ఇళ్లకు కనీస పరిహారంగా రూ. పాతిక వేల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. అలాగే ఆ ఇంట్లో ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల రిపేర్ల కోసం కూడాకొంత మంది పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక పూర్తికా కాకపోయినా కొంత మొత్తంలో నీరు వచ్చిన ఇళ్లకు కూడా రూ. పది వేల చొప్పున పరిహారం ఇచ్చే అవకాశం ఉంది. రిపేర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు వంటి వాటి కోసం అదనపు పరిహారం చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది.
బుడమేరు ముంపు కారణంగా వచ్చిన వరదలతో సింగ్ నగర్ తో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాలన్ని తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకూ నీరు వచ్చాయి. ఈ కారణగా ఎవరూ తమ ఇళ్లల్లో ఉండలేకపోయారు. అలాగే విలువైన వస్తువుల్నికూడా తీసుకెళ్లలేకపోయారు నీట మునిగి బైకులు ఎందుకు పనికి రాకుండా పోయాయి. చాలా మందికి ద్విచక్ర వాహనం ఉపాధి కి కీలకం. అందుకే ప్రభుత్వం వాహనాల రిపేర్లకు.. ప్రత్యేక పరిహారం ఇవ్వాలనుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు బాధితులకు భరోసా ఇచ్చారు. కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పర్యటించిన సీఎం కొల్లేరు, తాండవ వరదపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏలేరు వరద ముంపుతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు, ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం, దుస్తులు అందిస్తామని ప్రకటించారు. పంట నష్టం వేగంగా పూర్తి చేసి పరిహారం ఇస్తామని వారికి ధైర్యం చెప్పారు.
గతంలో తితలీ తుఫానుకు టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు రూ.20వేలు సా యం చేసిన విషయం గుర్తుచేశారు. జగన్ పాలనలో రూ.20 వేలను రూ.16 వేలకు తగ్గించారని, తర్వాత వెయ్యి పెంచారని వివరించారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో లెక్కిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే ప్రజలు చెబితే, సరిదిద్దుకుంటామని.. దీనికోసమే త్వరలో యాప్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.