విజయవాడ లో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తూన్న అవి బాధితులకు సరైన మార్గంలో అందడం లేదు. ఇదే అదను అని కొందరు ఆహారాన్ని అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారాన్ని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని, దీంతో అందరికి అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని బాధితులు వాపోతున్నారు. తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని కొందరు ఎదుచూస్తుంటే కొందరు మాత్రం బ్లాక్ లో అమ్ముకోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో వరద భాదితుల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూస్తున్నారు. మూడో రోజూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం విస్తృతంగా పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే సీఎం పర్యటన సాగించి.. ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. ప్రజల సమస్య తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే హెలికాప్టర్లు, పడవలు, N.D.R.F. సిబ్బందితో ఆహారం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా నిన్న డ్రోన్లను వినియోగించిన అధికారులు… ఇప్పుడు పూర్తిస్థాయిలో డ్రోన్లను సిద్ధం చేశారు. సహయ బృందాలు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్లను పంపిస్తూ ముంపు బాధితుల ఆకలి తీరుస్తున్నారు. ప్రతి సచివాలయానికి ఒక అధికారిని నియమించిన ప్రభుత్వం ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. సహాయక చర్యల్లో మంత్రులు పాల్గొని వరద బాధితులకు ప్రత్యెక్షంగా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ట్రాక్టర్లు, పొక్లెయిన్లు, బోట్లపై వెళ్లి ముంపు ప్రాంత ప్రజలకు తామున్నామని భరోసానిస్తున్నారు.
అలాగే బాధితులకు భోజనం పాకెట్స్ , వాటర్ బాటిల్స్ , పాల పాకిట్స్ తో పాటు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారాన్ని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని, దీంతో అందరికి అందడం లేదని ఆరోపిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది.