
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నేడు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్‌సభ, అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈవీఎం లు, ఇతర సామగ్రితో సిబ్బంది, ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రీపోలింగ్ లేకుండా హింసరహిత పోలింగే లక్ష్యమని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఎన్నికల కన్నా 10 వేల మంది కేంద్ర బలగాల్ని అదనంగా మోహరించింది. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 2 కోట్ల 3 లక్షల 39 వేల 851 మంది పురుష ఓటర్లు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. 46, 389 పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పార్లమెంటు సభ్యుడు పీవీ నర్సింహారావుగా రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తి కూడా ఆయనే. 1991లో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 5.8 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై గెలుపొందారు. 1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ పీవీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. అయితే, అప్పటికి ఆయనకు పార్లమెంటులో సభ్యత్వం లేదు. ప్రధానిగా కొనసాగాలంటే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఆయన ఎంపీగా గెలవాల్సి ఉంటుంది. దాంతో, పీవీ కోసం నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి గెలిచిన కొన్ని రోజులకే తన పదవిని త్యాగం చేశారు. అనంతరం ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని హోదాలో పీవీ నర్సింహారావు బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం అందుకున్నారు.
అలాగే,, పీవీ నర్సింహారావు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రికార్డుల్లో నిలిచారు. 2011లో కడప పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి మీద జగన్ గెలుపొందారు. ఆ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఓట్లలో 70 శాతం ఓట్లు జగన్‌కే పడగా, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ డిపాజిట్లు కోల్పోయారు. దీంతో పాటు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ 90,110 రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి జగన్ 75,243 మెజారటీ సాధించారు. 2009లో పులివెందుల నుంచి జగన్ తండ్రి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 68,681 మెజారిటీ సాధించగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అంతకు మించి ఓట్లు సాధించడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY