కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకం కానున్నారు. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 చోట్ల కూటమి విజయం సాధించింది. సొంతంగా టీడీపీ 16 స్థానాలు పొందింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కీలకం కావడంతో బీజేపీ అగ్ర నేతలు ఆయనకు అధిక ప్రాధాన్యమివ్వక తప్పదని జాతీయ మీడియా కోడైకూస్తోంది. అది వాస్తవం కూడా. ప్రత్యేక హోదానే కీలకమని బాబు భావిస్తే.. దాని గురించి పట్టుపట్టేందుకు ఇదే మంచి అవకాశమని మేధావులు సూచిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుకు ఇప్పుడు ఆ చాన్స్ వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గల మెజారిటీ సీట్లు రాకపోవడం కలిసిరానుంది. ప్రత్యేక హోదా కోసమే 2014లో ఎన్డీయేతో విభేదించి బయటకు వచ్చానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. అదే ప్రత్యేక హోదా ఇస్తేనే.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పేందుకు అవకాశం ఉంది.
కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు. చాలాకాలం తరువాత కేంద్రప్రభుత్వంలో దక్షిణాది వ్యక్తికి చక్రం తిప్పే అవకాశం వచ్చిందని జాతీయ మీడియా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలక భూమిక పోషించిన ఆయన.. వాజపేయి హయాంలోనూ ఎన్డీయే కన్వీనర్‌గా చక్రం తిప్పిన వైనాన్ని జాతీయ మీడియా విశేషంగా ప్రస్తావిస్తోంది. 2014లోనూ ఎన్డీయేలో ఉన్నా.. ప్రత్యేక హోదాపై విభేదించి బయటకు వెళ్లిపోయిన వైనాన్ని గుర్తుచేస్తోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపై రాజకీయ విశ్లేషకులు జాతీయ చానళ్లలో పలురకాలు విశ్లేషణలు చేస్తున్నారు.
ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు.. కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేసే అవకాశం ఉందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా కూడా కృషి చేయాలన్నారు. ప్రత్యేక హోదా లేకుంటే కూటమి హామీలు నెరవేర్చడం కష్టమని, మరింత అప్పులు తేవాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీకి 250 లోపే సీట్లు వచ్చి, మనపై ఆధారపడితే కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చని గతంలో జగన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చిందని, కాబట్టి కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. చంద్రబాబు ఆదిశగా ఆలోచిస్తారా? కేవలం పదవులు, ఆర్థిక ప్యాకేజీలకు ప్రాధాన్యమిస్తారా.. అనేది ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY