తిరుమలలో రాజకీయ ప్రసంగాలకు టీటీడీ ఇటీవల నిషేధం విధించింది. శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటినుంచి అమలులోకి వచ్చింది. గత కొంతకాలంగా కొన్ని రాజకీయ నేతలు శ్రీవారి దర్శనం తరువాత ఆలయం ముందు మీడియాతో మాట్లాడి రాజకీయ ప్రసంగాలు చేయడం, విమర్శలు చేయడం పెరిగింది. దీని వలన తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినిపోతుందని భక్తులు, సామాన్య ప్రజలు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో టీటీడీ కొత్త పాలకమండలి సమావేశంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, రాజకీయ ప్రసంగాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకుంది. ఇకపై, ఈ నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఇతర నిర్ణయాల విషయానికి వస్తే, టీటీడీ ఇటీవల అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ మరిన్ని చర్యలు చేపడుతుంది. నకిలీ గుర్తింపు కార్డులతో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులు పొందేందుకు అక్రమార్కులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, టీటీడీ వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ అనుసంధానాన్ని తీసుకొచ్చింది.
అలాగే, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించాలని, దీనికోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇతర కీలక నిర్ణయాల్లో, తిరుమలలోని చెత్తను మూడు నెలల్లో తొలగించాలని, శ్రీనివాస సేతును గరుడ వారధిగా మార్చాలని, తిరుపతిలోని పర్యాటక ప్రాంతాలకు ఇచ్చే దర్శన టికెట్లను రద్దు చేయాలని, టీటీడీ నగదును ప్రైవేటు బ్యాంకుల్లో నుంచి ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేయాలని నిర్ణయించారు.
ఇక, శారదా పీఠం లీజును రద్దు చేసి స్థలం తిరిగి తీసుకోవాలని, కొత్తగా నిర్మించనున్న ముంతాజ్ హోటల్ అనుమతిని రద్దు చేయాలని ప్రకటించారు. ఇదే సమయంలో, తిరుపతి ప్రజలకు ప్రతి నెలా మొదటి మంగళవారం ప్రత్యేక దర్శనం కల్పించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా, టీటీడీ మరింత పారదర్శకత, సమర్థతతో తమ సేవలు నిర్వహించాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది.