వైసీపీ నుంచి బయటకు వెళ్లిన ఎంపీలకు మాజీ సీఎంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అవగా..దీనికి విజయసాయి రెడ్డి రీ కౌంటర్ ఇవ్వడం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలోని ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళుతున్నారు. నలుగురు ఎంపీలు కూడా పార్టీని వీడి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరిలో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
అయితే విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి .. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయ ఉండాలని.. ప్రలోభాలకు లొంగకూడదని కౌంటర్ ఇచ్చారు. ఏకంగా విజయసాయిరెడ్డి పేరును కూడా ప్రస్తావించడటంతో..దీనికి ఎక్స్ వేదికగా సాయిరెడ్డి ట్వీట్ చేసి కౌంటర్ ఎటాక్ కు దిగారు.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని విజయసాయి ట్వీట్ చేశారు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్ లో రౌండ్లు కొడుతుంది.
అయితే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి ఆయన పేరు ప్రస్తావించకుండా ఇలా కౌంటరిచ్చారనే చర్చ జరుగుతోంది. నిజానికి విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన రోజే ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను వ్యక్తిగత కారణాలతోనే ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా జగన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మరోసారి అదే విషయాన్ని ఇప్పుడు ట్వీట్ చేశారు.
వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు పార్టీని వీడటంపై గురువారం వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలని.. ఫలానా వాళ్లు తమ నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలని చెప్పారు. బయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని.. భయపడో, ప్రలోభాలకు లొంగో..లేకపోతే రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటని ప్రశ్నించారు.
రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని.. ఐదేళ్లు కష్టపడితే మళ్లీ ‘మనకు’ టైం వస్తుందని కానీ విశ్వసనీయత ముఖ్యం.. అది ఎవరికైనా వర్తిస్తుందని చెప్పారు.
తమ రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని జగన్ చెప్పారు. అయితే జగన్ వేసిన కౌంటర్ కు రీ కౌంటర్ ఇస్తూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీటు పుట్టిస్తోంది.