విజయసాయిరెడ్డి నోట కసిరెడ్డి మాట..మరి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎక్కడ ?

ఆంధ్రప్రదేశ్‌లో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. లిక్కర్ స్కామ్‌ కేసులో కసిరెడ్డే కింగ్‌మేకర్‌ అన్న సాయిరెడ్డి కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆయన హాట్‌టాపిక్‌గా మారారు. దీంతో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును విజయసాయిరెడ్డి సడెన్‌గా ఎందుకు తెరపైకి తెచ్చారనేది తీవ్ర చర్చనీయాంశం అయింది.
కాకినాడ సెజ్‌ కేసులో విజయవాడ సీఐడీ పోలీసుల ఎదుట బుధవారం విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారునిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఏపీ లిక్కర్‌ సేల్స్‌ స్కామ్‌లో పాత్రదారి, సూత్రదారి కూడా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే అన్న విజయసాయి..సమయం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు బయట పెడతానని అనడం సంచలనంగా సృష్టిస్తోంది.

నిజానికి ఏపీ మద్యం అమ్మకాల కుంభకోణంలో వ్యవహారమంతా తెర వెనుక ఉండి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నడిపించారని ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అయితే ఇప్పుడు సాయి రెడ్డి ఆయన పేరును బయటకు తీసుకువచ్చి కామెంట్స్‌ చేయడం ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఏపీలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రవేశపెట్టిన లిక్కర్‌ బ్రాండ్స్‌పై అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా లిక్కర్‌ సేల్స్‌లో డబ్బులను వైసీపీ పెద్దలు కొంతమంది పక్కదారి పట్టించారని.. డిజిటల్ లావాదేవీలు లేని అమ్మకాలు చేశారని టీడీపీ ఆరోపించింది

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మద్యం కుంభకోణంలో అక్రమ లావాదేవీలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే నాటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. వేల కోట్ల మద్యం వ్యాపారంలో ప్రభుత్వ ఆదాయానికి బాగా గండి కొట్టారనే ఆరోపణలతో వీరిద్దరిపై కేసులు నమోదు అయి..విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పుడు విజయసాయి రెడ్డి నోటి వెంట.. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు రావడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది.

విదేశాల్లో లిక్కర్ కంపెనీలను నడుపుతున్న వ్యక్తి .. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. అయితే.. వైపీసీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టిన ఆయన..కొద్దికాలంలోనే జగన్ టీంలో కీలక వ్యక్తిగా మారారు. అంతెందుకు గత ప్రభుత్వంలో ఏకంగా షాడో సీఎంగా పని చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
పేరుకు ఐటీ సలహాదారుడే అయినా మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారనే వార్తలు గట్టిగా వినిపించాయి. ఇటీవల ఏపీ లిక్కర్‌ సేల్స్‌ కేసులో అరెస్టయిన వాసుదేవరెడ్డి కూడా సీఐడీ విచారణలో తనకు ఈ విషయంలో ఏ సంబంధం లేదని చెబుతూ కసిరెడ్డి పేరును వెల్లడించారు. అయితే కసిరెడ్డి మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. దీంతో అప్పటి నుంచి కూడా ఆయన కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.