
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. వరుసగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సమీక్షా సమావేశాలలో ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలతో పాటు వాటికనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు.
దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కార్యాలయానికి అందుతున్న.. స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు, తమ అనుభవాలను తెలియచేస్తూ నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్ కలిసి మాట్లాడారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచడానికి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిం చడానికి అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను పవన్ కళ్యాణ్‌కు చూపించారు.
ఇలా అందరి సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని అన్నారు. త్వరలో వినాయక చవితి రాబోతుంది కాబట్టి.. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దీనివల్ల జల కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు. అంతేకాకుండా మట్టి గణపతికి చేసే పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఇందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని పవన్ అన్నారు.
అదే విధంగా అన్ని దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్‌తో చేసిన కవర్లలో అందిస్తున్నారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం.. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారని తెలిపారు. అలాంటి కవర్లకు చిన్నచిన్న తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభమని వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో వీటి వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టడానికి కార్యాచరణ రూపొందించబోతున్నామని పవన్ తెలిపారు. పవన్ నిర్ణయంతో పర్యావరణ వేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE