పర్యాటకులకు గుడ్ న్యూస్. విశాఖపట్టణం నగర ప్రతిష్ఠను పెంచే విధంగా కైలాసగిరిపై సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను నేడు ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అధికారులు తెలిపారు.
ఇక్కడినుండి సముద్ర దృశ్యం, నగర సౌందర్యం అద్భుతంగా కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం వల్ల ఇది విశాఖలో మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. అతి త్వరలోనే ఇది పర్యాటకులను ఆకర్షిస్తుందని, తద్వారా పర్యాటకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు, నగర టూరిజం ఆదాయాన్ని పెంపొందించే అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
గ్లాస్ బ్రిడ్జి ప్రత్యేకతలు
-
నిర్మాణం: ఈ బ్రిడ్జి నిర్మాణానికి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును ఉపయోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.
-
బలం: ఈ బ్రిడ్జి ఒకేసారి 500 టన్నుల బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంది.
-
వాతావరణ నిరోధకత: గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా ఈ బ్రిడ్జిని డిజైన్ చేశారు.
-
పర్యాటక సామర్థ్యం: ఒకేసారి 40 మంది పర్యాటకులు బ్రిడ్జిపై నిలబడి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది.
పర్యాటక అభివృద్ధి లక్ష్యం
ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ మాట్లాడుతూ, విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్లాస్ బ్రిడ్జికి అదనంగా, త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయనున్నట్లు వివరించారు.





































