ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. కన్న కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అతడి మాతృమూర్తి సంచలన విషయాలు చెబుతూ అభిమానులతో లేఖ పంచుకున్నారు. తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తన మనసుకు చాలా బాధేస్తోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అంటూ బాధపడ్డారు.
వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు తన పిల్లలతో కుటుంబం సంతోషంగా ఉందని గుర్తు చేసుకున్నారు. తన కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని.. అబద్ధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని హితబోధ పలికారు. తన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. తన బిడ్డల సమస్యలకు తాను నమ్ముకున్న దేవుడు పరిష్కారం ఇస్తాడని విజయమ్మ లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక అస్తుల పంపకంపై స్పందించిన విజయమ్మ..ఆస్తులు తన ఇద్దరు పిల్లలకు ఇద్దరికీ సమానమని చెప్పారు. విజయసాయి రెడ్డి ఆడిటర్‌గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్నా. వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, YSR ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం.