మరాఠా సామ్రాజ్యం కోసం ధైర్యంగా పోరాడిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా ‘ఛావా’. ఈ కథ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ప్రారంభమవుతుంది. ఔరంగజేబు దక్కన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని యత్నించగా, శంభాజీ (విక్కీ కౌశల్) అతనికి గట్టి పోటీనిచ్చాడు. బర్హాన్ పూర్ మీద చేసిన ఆకస్మిక దాడితో మొఘలులకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాడు. అయితే, ఈ విజయాలతో పాటు శంభాజీ తన సామ్రాజ్యంలో అంతర్గత విభేదాలతోనూ పోరాడాల్సి వచ్చింది. చివరికి అతను ఔరంగజేబు చేతికి చిక్కి, అమానుషంగా హింసకు గురై వీర మరణం పొందాడు.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, శంభాజీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆకర్షణీయంగా తెరపై చూపిస్తుంది. విక్కీ కౌశల్ తన శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్నాడు. శంభాజీ పాత్రలోని గౌరవం, ధైర్యం, త్యాగం అన్నీ అతని అభినయంలో స్పష్టంగా కనిపిస్తాయి. రష్మిక మందన్న (ఏసుబాయి) హుందాతనంతో ఆకట్టుకోగా, అక్షయ్ ఖన్నా (ఔరంగజేబు) తన నెగటివ్ షేడ్ పాత్రను బలంగా పోషించాడు.
సాంకేతికంగా సినిమా చాలా బలంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు, సెట్స్, విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. అయితే, తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల అంత ఫీలింగ్ రానీయలేదు. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అద్భుతంగా ఉన్నా, పాటలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి.
‘ఛావా’ అనేది కేవలం యుద్ధగాధ మాత్రమే కాదు, శంభాజీ మహారాజ్ యొక్క త్యాగం, వీరత్వానికి నిదర్శనం. ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూడదగినదే.
రేటింగ్: 3½