బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరొక సంచలనం సృష్టించారు. ఆయన ముంబైలోని ఓషివారాలో ఉన్న విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ఇటీవల రూ.83 కోట్లకు విక్రయించారు. ఇది 2021లో రూ.31 కోట్లకు కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ కావడం విశేషం. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఈ అపార్ట్‌మెంట్ ధర 168% పెరిగింది.
రియల్ ఎస్టేట్‌లో అమితాబ్ లాభాలు:
అమితాబ్ బచ్చన్ ఈ అపార్ట్‌మెంట్‌ను క్రిస్టల్ గ్రూప్ (Crystall Group) నిర్మించిన ‘ది అట్లాంటిస్’ ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేశారు. 5,704 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 4,800 చదరపు అడుగుల విశాలమైన టెర్రస్ ఉన్న ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఒక మోడర్న్ లైఫ్స్‌స్టైల్‌కు సరిపోయేలా ఉంది. అపార్ట్‌మెంట్‌లో ఆరు మెకానైజ్డ్ కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి, అలాగే నటి కృతి సనన్ ఈ అపార్ట్‌మెంట్‌ను 2021లో నెలకు రూ.10 లక్షలకు అద్దెకు తీసుకున్నారు.
2025 జనవరిలో, ఈ అపార్ట్‌మెంట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్ మరియు కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు. ఈ డీల్‌లో స్టాంప్ డ్యూటీ రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000 చెల్లించబడ్డాయి. ఈ ప్రాంతంలో సాధారణంగా ధరలు అంతగా పెరగకపోయినా, అమితాబ్ బచ్చన్ బ్రాండ్ విలువ ఈ భారీ లాభాలకు కారణమని భావిస్తున్నారు.
మరో భారీ పెట్టుబడులు:
ముంబైలో రియల్ ఎస్టేట్‌లో బిగ్ బి గత నాలుగేళ్లలో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2023లో అంధేరి వెస్ట్‌లో రూ.60 కోట్లకు మూడు కమర్షియల్ ప్లాట్‌లను కొనుగోలు చేయడం, అలాగే ములుండ్ ప్రాంతంలో 10 అపార్ట్‌మెంట్‌లను కొనడం ఆయన వ్యాపార దృష్టికి ఉదాహరణ.
సినిమాల నుంచి వ్యాపారవైపు బిగ్ బి:
అమితాబ్ బచ్చన్ సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ టెలివిజన్ షోస్ ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ప్రభాస్‌తో కల్కి మూవీలో నటించిన బిగ్ బి ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక, ‘ఆంఖ్ మిచోలీ 2’లో కూడా కనిపించనున్నారు. ఈ డ్యూప్లెక్స్ అమ్మకం విజయవంతం కావడం బాలీవుడ్ లెజెండ్‌కి మరో ఘనత. రియల్ ఎస్టేట్‌లోనూ ఆయన తన ప్రత్యేకమైన మార్క్ చూపించడం విశేషం.