లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని కేసు పెట్టడంతో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. ఈ కేసులో జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ ఈ కేసు విషయంలో చంచల్ గూడా జైలులోనే ఉన్నారు.
జానీ మాస్టర్ పై మహిళ కొరియోగ్రాఫర్ లైంగిలక ఆరోపణల నేపథ్యంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం అమ్మాయిలు .. లైంగికంగా వాడుకోబడుతున్నారనే విషయం సంచలనంగా మారింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేంద్రం జానీ మాస్టర్ కు ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డును క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే కదా. జాతీయ అవార్డు అందుకోవడం కోసం అప్పట్లో బెయిల్ కోసం అభ్యర్ధించిన సంగతి తెలిసిందే కదా. తీరా ప్రభుత్వం అతనిపై పోక్సో వంటి కఠినమైన చట్టం నమోదు కావడంతో అవార్డు క్యాన్సిల్ అయింది.
ఈ అవార్డు స్వీకరణ కార్యక్రమం ఉందనే కారణంగానే జానీ మాస్టర్‌కు అక్టోబర్ ఈ నెల 6 నుంచి 9 వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత గడువు ముగియడంతో.. మళ్లీ జైలుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.. తాజాగా హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ గురువారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ కి సపోర్ట్ గా అతని కుటుంబం, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ మాట్లాడారు. జానీ మాస్టర్ తల్లి హాస్పిటల్ లో ఉంది. దీంతో జానీ మాస్టర్ జైలు నుంచి బయటకి వచ్చాక మీడియా ముందుకు వచ్చి ఈ కేసు గురించి మాట్లాడతారా లేదా అని చర్చగా మారింది.