ఎన్నో అంచనాల నడుమ, మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం, శంకర్ తొలిసారిగా ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించడం గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలను పెంచాయి. గత చిత్రాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని శంకర్ ఈసారి అత్యున్నత జాగ్రత్తలతో గేమ్ ఛేంజర్ను రూపొందించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
బిజినెస్ రికార్డులు:
గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. నైజాంలో రూ.43 కోట్లు, ఆంధ్రాలో రూ.75 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్ల మేర బిజినెస్ జరగ్గా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.145 కోట్ల బిజినెస్ పూర్తయింది. ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమాకు రూ.150 కోట్ల షేర్, రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా పేర్కొన్నారు.
వసూళ్ల హవా:
మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.44 కోట్లు, తమిళనాడులో రూ.2.26 కోట్లు, హిందీలో రూ.8 కోట్లు, కర్ణాటక + మలయాళంలో రూ.36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.4 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హవాను అందుకోలేకపోయినప్పటికీ, రామ్ చరణ్ సొలో హీరోగా రికార్డులను తిరగరాసాడు.
సంక్రాంతి సెలవులు, వీకెండ్ పండుగ వాతావరణం నేపథ్యంలో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని చెప్పడంలో సందేహం లేదు.