అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ను సైబారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉన్న అతన్ని ను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
జానీ మాస్టర్ వద్ద పని చేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని.. పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని పేర్కొంది. ఆమె మొదటగా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె నివాసం ఉంటున్న ఇల్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై 376 అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బుధవారం ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు.
తనపై లైగింక వేధింపుల కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. జానీ కోసం పోలీసులు ఐదు రోజులుగా వెతుకుతున్నారు. చివరికి అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జానీని సాయంత్రం లేదు రాత్రి వరకు హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పోలీసులు జానీ మాస్టర్ ను కస్టడీ కోరే అవకాశం ఉంది. జానీ మాస్టర్ పై కేసు నమోదు అయిందని తెలియగానే.. జనసేన అతన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోవైపు తెలుపు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ కూడా ఈ విషయమై విచారణ చేస్తోంది. కాగా బాధితురాలికి ఓ పెద్ద హీరో అండగా నిలిచాడని యాంకర్, యాక్టర్ ఝాన్సీ తెలిపారు. ఆ బాడా హీరో అల్లు అర్జునే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.