వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా పాన్ మసాలా యాడ్స్ ఇస్తున్నారని అందిన ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు సీడీఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురితో పాటు విమల్ పాన్ మసాలా తయారు చేసే JB ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్ కుమార్ అగర్వాల్‌కు కూడా జైపూర్ వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మార్చి 19న తమ ముందు హాజరు కావాలని వీరిని ఆదేశించింది. విచారణకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన రోజు నుంచి 30 రోజుల్లోపు దీనిపై వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
అయితే ఈ నోటీసులపై ఇప్పటి వరకు ఈ ముగ్గురు హీరోలు కూడా స్పందించలేదు. జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ ఫిర్యాదు చేయడంతో.. ఈ నోటీసులు జారీ చేశారు. పాన్ మసాల యాడ్ లో.. దానే దానే మే హై కేసర్ కా దమ్ అంటే పాన్ మసాలాలోని ప్రతి గింజకు కుంకుమపువ్వు శక్తి ఉందని చెప్పారని.. ఈ యాడ్స్ చూసి సామాన్య ప్రజలు పాన్ మసాలాను విపరీతంగా తింటున్నారని ఆయన ఆరోపించారు. కానీ పాన్ మసాలా ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ తో జేబీ ఇండస్ట్రీస్ కోట్లాది రూపాయలు సంపాదిస్తోందంటూ యోగేంద్ర సింగ్ తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. కుంకుమపువ్వుతో కూడిన గుట్కా.. విమల్ పాన్ మసాలా కొనుగోలు చేయడానికి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
వాళ్లు ప్రకటనల్లో చెబుతున్నట్లు దానిలో ఎలాంటి కుంకుమపువ్వు పదార్ధం మిశ్రమం లేదని ఫిర్యాదు దారు తెలిపారు. ఎందుకంటే మార్కెట్లో కుంకుమ పువ్వు ధర కిలోకు రూ.4 లక్షలు, పాన్ మసాలా ధర కేవలం 5 రూపాయలు మాత్రమేనని, అంత కాస్ట్లీ అయిన కుంకుమపువ్వును పాన్ మసాలాలో కలుపుతున్నామని ప్రజలను ఎలా మోసగిస్తారని ప్రశ్నించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, సాధారణ ప్రజలను మోసం చేస్తున్న కంపెనీ తరపున యాడ్స్ చేసిన నటులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు. దీంతో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు కన్సూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ నోటీసులు చేయగా.. ఇప్పటి వరకూ ఈ హీరోలెవరూ స్పందించలేదు.