పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప-2 పై ప్రేక్షకుల్లో అపారమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడని సినీ పరిశ్రమ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 2018లో విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నారు. ‘పుష్ప’ విజయంతో నార్త్ ఆడియెన్స్‌లో ఆయనకు విశేషమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ఏర్పాటవుతున్నాయి. ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సందు ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ పక్కా ఎంటర్‌టైనర్‌గా అభివర్ణిస్తూ, అల్లు అర్జున్ పాన్ ఇండియా నంబర్ వన్ హీరోగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. సినిమాపై ఇచ్చిన ఈ రివ్యూ నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే, సినిమా విడుదలకు ముందే పుష్ప-2పై రాజకీయ వివాదాలు చోటుచేసుకున్నాయి. అల్లు అర్జున్ గతంలో వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొనడం మెగా అభిమానులకు వ్యతిరేకంగా మారింది. ఈ చర్యతో మెగా ఫ్యామిలీ అభిమానులు అల్లు అర్జున్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పుష్ప-2ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అదే సమయంలో వైసీపీ శ్రేణులు ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు దీనికి ఉదాహరణ. “మా కోసం నువ్వు వచ్చావు…మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే” అంటూ అల్లు అర్జున్, వైసీపీ నేత జగన్ ఫోటోలు కలిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మరోవైపు, అల్లు అర్జున్ పుష్ప-2 ప్రమోషన్ కోసం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ, ప్రేక్షకులతో నేరుగా కలుస్తున్నారు. నేషన్ వైడ్‌గా పుష్ప మ్యానియా స్పష్టంగా కనిపిస్తోంది. పుష్ప-2 ఎలా ఉండబోతుందో అని ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.