సంధ్య థియేటర్ విషాద ఘటనపై తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ప్రవర్తన అమానుషమని, అతను మానవత్వానికి తగ్గట్టు వ్యవహరించలేదని విమర్శించారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నటుడు అల్లు అర్జున్ థియేటర్‌కు పోలీసుల అనుమతి లేకుండానే వెళ్లారని, సరిగ్గా ఆ సమయంలో ప్రేక్షకుల గందరగోళం ఆ మహిళా మృతికి కారణమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు, తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయాన్ని తెలిసినప్పటికీ, అల్లు అర్జున్ సినిమా చూడటానికి లోపలి వెళ్లారని, తర్వాత బయటకు వచ్చి రోడ్‌షో నిర్వహించినట్టు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రేవంత్ సినీ ప్రముఖుల తీరును విమర్శించారు. అరెస్ట్ తరువాత విదుదలైన వెంటనే అందరూ సెలెబ్రిటీలు అల్లు అర్జున్ ని చూడటానికి వెళ్లారే కానీ, ఏ ఒక్కరు కూడా చావు బతుకుల మధ్య ఉన్న రేవతి కొడుకు దగ్గరికి వెళ్లలేదని మండిపడ్డారు. అలాగే, నటుడి అరెస్ట్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఇతర రాజకీయ నాయకులకు ఆయన చురకలు అంటించారు.
ఈ ఘటనకు కారణమైన నటుడు, థియేటర్ యాజమాన్యంపై నగర పోలీసులు కేసు నమోదు చేయడం, తరువాత అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరైన అంశాలను ప్రస్తావించారు. ఇకపై టిక్కెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై ప్రభుత్వం నిషేధం విధించిందని కూడా సీఎం స్పష్టం చేశారు.
మహిళ మరణం, ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న బాధల విషయంలో సినీ ప్రముఖుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి, నైతిక బాధ్యత అనేది ప్రముఖులకు ఉండాలని, నిబంధనలతో పాటుగా వ్యవహరించాలని సూచించారు.