బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. సైఫ్ ఇంట్లోకి చొరబడి జరిగిన ఈ దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
జనవరి 16 అర్ధరాత్రి నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. మొదట అతడు సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ గదిలోకి వెళ్లాడు. ఈ ఘటనను గమనించిన నర్సు ఎలియామా ఫిలిప్స్ అతడిని నిలువరించేందుకు ప్రయత్నించగా, దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అరుపులు వినిపించడంతో సైఫ్ అక్కడకు వచ్చి దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దుండగుడు సైఫ్‌ను కత్తితో ఆరు చోట్ల గాయపరిచాడు.
సైఫ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని ఆటోలో ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించాడు. అక్కడ సైఫ్ వెన్నెముకపై జరిగిన కత్తి దెబ్బకు రెండున్నర అంగుళాల బ్లేడ్‌ను డాక్టర్లు తీసి సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ముంబై పోలీసులు ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేశారు. సైఫ్ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు ముంబైలోని లోకల్ ట్రెయిన్ ద్వారా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతడి కోసం ప్రత్యేకంగా 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, కర్రలు మరియు బ్లేడ్‌తో పారిపోతున్న అతడి దృశ్యాలను సీసీటీవీలో గుర్తించారు.
నిందితుడి అరెస్టు
నిన్నటిరాత్రి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడి నుంచి విచారణ జరుగుతోంది. అతడు దాడి ముందు సైఫ్‌కు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. విపక్షాలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విమర్శలు గుప్పించాయి. బాంద్రా లాంటి ప్రముఖ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ, “వీఐపీలకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు.
కరీనా కపూర్ విజ్ఞప్తి
ఈ దాడి ఘటనపై కరీనా కపూర్ సోషల్ మీడియాలో స్పందించారు. “మా కుటుంబానికి ఇది చాలా కఠినమైన రోజు. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా గోప్యతను గౌరవించాలని, ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భద్రతాపరమైన ప్రశ్నలను రేపింది. నిందితుడి అరెస్ట్‌తో విచారణ పురోగతిలో ఉన్నప్పటికీ, ఈ ఘటన భద్రతా వ్యవస్థపై ఆలోచనకు తావిచ్చింది.
BREAKING: Saif Ali Khan attacker🔪 ARRESTED👮🏻 pic.twitter.com/mNQnloidQc
— Manobala Vijayabalan (@ManobalaV) January 17, 2025